నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముహూర్త బలమేమో గానీ.. ఈ సినిమా షూటింగ్ చకచకా పూర్తి కావస్తున్నది. రీసెంట్గా ఇందులో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్.. ఫస్ట్ పార్ట్‌లో తనకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నానని ఆనందం వ్యక్తం చేస్తూ తన సోషల్‌మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు. ‘నా కల నెరవేరింది. ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నందుకు గర్వంగా కూడా ఉంది. చిన్నప్పట్నుంచీ మనం వింటూ పెరిగిన గొప్ప కావ్యం రామాయణం. ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులతో రెండు భాగాలుగా నితీష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పార్ట్‌వన్‌లో నా భాగం పూర్తయింది. త్వరలోనే పార్ట్2 షూటింగ్ కూడా మొదలుకానుంది. శ్రీరాముడిగా నటించడం నాకల. ఈ సినిమాతో అది తీరిపోయింది. మన దేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపారు రణబీర్ కపూర్. ఇదిలావుంటే.. ఇటీవలే ఈ సినిమాల విడుదల తేదీలను చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. 2026 దీపావళికి తొలిభాగం, 2027 దీపావళికి మలిభాగం విడుదల చేయనున్నట్టు వారు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.