Ramayana | రామాయణ ఇతిహాసం మనం సినిమాలు, సీరియల్స్‌గా పలు భాషలలో చూశాం. చిన్నప్పటి నుండి రామాయణాన్ని ఎన్నో విధాలుగా తెరపైన వీక్షించాం. ఇక రామాయణాన్ని సరికొత్తగా ఈ తరం వారికి చేర్చాలనే ఉద్దేశంతో పలువురు దర్శకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కినదే. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ అందుకోలేకపోయింది. అంతేకాకుండా, రామాయణాన్ని వక్రీకరించారన్న విమర్శలూ గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో ‘రామాయణ’ మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు పార్ట్‌లుగా రామాయణ చిత్రం తెరకెక్కనుండగా, ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా.. సాయిపల్లవి సీతమ్మగా నటిస్తున్నారు. ఇందులో రావణుని పాత్రలో యశ్ కనిపించనున్నారు. అయతే సోమవారం ఉదయం ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన త్వరలోనే ఆయన ‘రామాయణ పార్ట్ 1 మూవీ సెట్లో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
యష్ తన ప్రతీ సినిమాను ఆలయ సందర్శనతో ప్రారంభిస్తారు. ఇందులో భాగంగానే ‘రామాయణ’ మూవీలో భాగం అయ్యే ముందు శివున్ని దర్శించుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథలాజికల్ ఎపిక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. తొలి పార్ట్ షూటింగ్ తుది దశకు చేరుకోగా, ‘పార్ట్ 2’ను సైతం అప్పుడే పట్టాలెక్కించేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో యశ్ రావణుడి పాత్ర పోషించడమే కాదు, తన బ్యానర్ అయిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో పాటు మల్హోటా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘రామాయణ పార్ట్ 1’ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ‘పార్ట్ 2’ 2027 దీపావళికి రిలీజ్ కానుంది.