‘ఏ సత్య కన్ఫెషన్ టూ మై సెల్ఫ్’ అనే హెడ్డింగ్‌తో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 27 ఏళ్ల తర్వాత ఈ మధ్యే ‘సత్య’ సినిమా చూసినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లొచ్చాయని, అలాంటి గొప్ప సినిమా తీసిన తాను గత కొంతకాలంగా ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని ఆర్జీవీ తన పోస్ట్‌లో ఆవేదన చెందారు. సత్య, రంగీలా సినిమాలు అందించిన విజయాలు తనలో అహంకారాన్ని పెంచాయని, ఆ విజయాల వెలుగులో కళ్లుమూసుకుపోయిన తాను ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశానని ఆయన చెప్పుకొచ్చారు.
‘గత కొన్నేళ్లుగా నాకున్న తెలివితేటలతో గిమ్మిక్కులు ప్రదర్శించి అర్థపర్థం లేని కంటెంట్‌తో సినిమాలు తీశా. నా ప్రతిభకు తగిన విధంగా ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలను కల్పించింది. అయినా నేను వాటిని ఉపయోగించుకోలేదు. నా తప్పుల్ని కూడా సరిదిద్దుకోలేకపోయాను. అందుకే రెండు రోజుల క్రితం ఓ ప్రతిజ్ఞ చేసుకున్నా. ఇక నుంచి నేను డైరెక్ట్ చేసే ప్రతీ సినిమా దర్శకుడిగా నా స్థాయిని పెంచేలా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇక నా మిగిలిన జీవితాన్ని నిజాయితీగా గడుపుతూ, ‘సత్య’ స్థాయి ప్రమాణాలు కలిగిన గొప్ప సినిమాలు తీయాలనుకుంటున్నా. ఇది ‘సత్య’ మీద నేను చేస్తున్న ప్రమాణం’ అంటూ రామ్‌గోపాల్‌వర్మ తన సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు.