సాయిధరమ్‌తేజ్, కలర్స్ స్వాతి జంటగా విజయ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫీచర్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ షార్ట్ ఫీచర్ నుంచి ‘సోల్ ఆఫ్ సత్య’ అనే మ్యూజికల్ వీడియోను అగ్ర హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘ ఓ అమ్మాయి జీవితంలో ఎన్నో కలలుంటాయి. అలాంటి అమ్మాయికి మిలటరీ వ్యక్తి భర్తగా దొరికితే ఎలా ఉంటుందనే అంశాన్ని ‘సోల్ ఆఫ్ సత్య’లో ఆవిష్కరించాం. సైనికుల త్యాగాలను గుర్తు చేసే వీడియో ఇది.
తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈ గీతాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ ‘మన రేపటి కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వారందరికి సెల్యూట్. అలాంటి సైనికులను సరిహద్దులకు పంపుతున్న తల్లులు, భార్యలందరికి నా ధన్యవాదాలు. వారందరికి నివాళిగా ఈ వీడియోను రూపొందించాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనం ఎవరినైనా మిస్ చేసుకున్నప్పుడు కలిగే భావోద్వేగాలను ఈ వీడియోలో హృద్యంగా ఆవిష్కరించాం. సంగీత దర్శకురాలు శృతి రంజని చక్కటి ట్యూన్ ఇచ్చారు’ అని చెప్పారు. ఓ సదాశయంతో ఈ షార్ట్ఫీచర్ను రూపొందించామని నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి తెలిపారు.