Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. రజనీ భార్య లతతో బుధవారం ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన లత రజనీకాంత్‌తో మాట్లాడారని ‘ఎక్స్’ పోస్ట్ తెలిపారు. ఆయనకు శస్త్ర చికిత్స జరిగిందని ప్రధానికి తెలిపారని.. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారన్నారు. తలైవర్ ఇటీవల ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. నాన్ సర్జికల్, ట్రాన్స్ క్యాథెటర్ విధానంలో చికిత్స అందించినట్లు తెలిపారు. వాపు వచ్చిన రక్తనాళంలో స్టెంట్ వేసినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. రెండు మూడురోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నది. రజనీకాంత్ ప్రస్తుతం వెట్టయాన్ మూవీలో నటిస్తుండగా.. రిలీజ్‌కు సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రాణా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, రోహిణి, దుషారా విజయన్, రావు రమేష్, రమేశ్ తిలక్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానున్నది. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్, రజనీ కాంబోలో ‘కూలి’ చిత్రం తెరకెక్కనున్నది. ఇప్పటికే టీజర్ విడుదల కాగా.. మూవీపై భారీ అంచనాలున్నాయి.