Rajasekhar Mamidanna Stand up Comedy show | నవ్వు ప్యాకేజ్డ్ వాటర్ లాంటిది. లీటర్ల లెక్కన కొనుక్కోవచ్చు. హాస్యం ఆక్సిజన్ బార్ లాంటిది. గంటల ప్రకారం బుక్ చేసుకోవచ్చు. అలానే, నవ్వుకూ ఓ రేటుంది. కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా, స్టాండప్ కామెడీ షోలు.. నిత్య జీవితంలోని ఒత్తిడిని తరిమేస్తున్నాయి. అందులోనూ రాజశేఖర్ మామిడన్న స్టాండప్ కామెడీ షో అంటే.. నవరసాల సమాహారమే.
పార్క్‌లో ప్రేమికుల పెండ్లి ముచ్చట్లు.
స్వాతి: రాహుల్! మా ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వెప్పుడు చేసుకుంటావో చెబితే.. డాడీతో మాట్లాడతా!
రాహుల్: చెప్పాగా! నేను తెలుగు టైటాన్స్‌కి పెద్ద ఫ్యాన్!
వచ్చే సీజన్లో వాళ్లు సిరీస్ గెలిస్తేనే మనం పెండ్లి చేసుకునేది.
(గత సీజన్లో ఒక్క మ్యాచే గెలిచింది టీటీ)
* * *
ఆ మధ్య నేను మెడిటేషన్ కోర్సులో చేరాను. వారం పదిరోజులు అక్కడే ఉండాలి. మొదటి రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకే ధ్యానం మొదలైంది. డీ..ప్..మెడిటేషన్!
కండ్లు తెరిస్తే చీకటి. గడియారం మాత్రం మెరుస్తున్నది. నాలుగు గంటలా పదిహేను నిమిషాలు. అంటే.. పన్నెండు గంటలపైనే ధ్యానంలో ఉన్నానన్న మాట! కండ్లు తెరిచి
‘సెభాష్.. మామిడన్నా!’ అంటూ నా భుజం నేను తడుముకోవాలని అనుకున్నా.
అంతలోనే గురూజీ గుసగుసగా చెప్పారు.. ‘ఇంకా పదిహేను నిమిషాలు కూడా కాలేదు. కండ్లు తెరవకండి’
(ఓ చిన్న జోక్. నవ్వుల బాంబు పేలింది)
* * *
రాజశేఖర్ మామిడన్న హాస్యమే అంత. జీవితంలోంచి పుడుతుంది. నిత్య జీవిత సంభాషణలను తలపిస్తుంది. స్టాండప్ కామెడీ అంటేనే వంకర డైలాగులని అనుకునే రోజుల్లో ఆరోగ్యకరమైన వెజ్ హాస్యాన్ని సృష్టించాడు రాజశేఖర్. చిన్నచిన్న వాక్యాలకు.. విరుపులు, మెరుపులు జోడిస్తాడు. హావభావాలతో అదనపు హంగులద్దుతాడు. తనపై తానే జోకులు వేసుకొంటాడు.
మామిడన్న హాస్యంలో హైదరాబాదీ డబుల్ కా మీఠా తీపి, దమ్ బిర్యానీలోని ఘాటు కలగలిసి ఉంటాయి. తను ఇక్కడే, ఈ గల్లీల్లోనే పుట్టి పెరిగాడు. ఇంజినీరింగ్ తర్వాత ఎంబీఏ చేశాడు. చాలా ఉద్యోగాలే వెలగబెట్టాడు. అవేవీ సంతృప్తిని ఇవ్వకపోవడంతో స్టాండప్ కామెడీ వైపు అడుగులేశాడు. 2013లో మొదటిసారిగా కొంతమంది మిత్రులతో కలిసి స్టాండప్ కామెడీలో భాగంగా చేసిన ‘ఓపెన్ మైక్’ ఈవెంట్ ఓ కొత్త ఒరవడిని హైదరాబాద్‌కు పరిచయమైంది. మామిడన్న ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్ షోలు చేస్తుంటాడు. తెలుగు ప్రేక్షకుల కోసం మాతృభాషలోనూ ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఆయన యూట్యూబ్ చానల్‌కు దాదాపు రెండు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రత్యేకించి రాజశేఖర్ షో కోసం ‘బుక్ మై షో’ వంటి సంస్థలు థియేటర్ బుక్ చేసి, ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తుంటాయి. ఫేస్బుక్, ఇన్‌స్టా వేదికగా లైవ్‌లోకి వచ్చి మరీ అభిమానులను నవ్విస్తుంటాడు మామిడన్న.
రెండు గంటల షోలో నిమిషానికి అథమపక్షం నాలుగుసార్లయినా నవ్వించి తీరాలన్నది మామిడన్న తీర్మానం. ఆ ప్రయత్నంలో తనెప్పుడూ విఫలం కాలేదు. ‘సమయస్ఫూర్తితో నవ్వులు పూయించకపోతే షో రక్తికట్టదు. పంచ్ డైలాగులు, ప్రాసలు.. ఏమైనా కావచ్చు. ప్రేక్షకుడిని మాత్రం కుర్చీలో కుదురుగా కూర్చోనివ్వకూడదు. చప్పట్లు, విజిళ్లతో నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లకపోతే మేం నవ్వులపాలవుతాం’ అంటాడు రాజశేఖర్. ఇప్పుడు నగరంలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలోనూ ఆర్కెస్ట్రాతో పాటుగా స్టాండప్ కామెడీ కూడా చేరింది. కార్పొరేట్ ఈవెంట్స్, కాఫీ షాపు ప్రారంభోత్సవాలు, గెట్ టు గెదర్ పార్టీ, వివాహ వేడుకలు, పుట్టినరోజు ఫంక్షన్లలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతున్నది. ‘నాకు బాగా గుర్తుంది. 2008 నుంచీ దేశంలో కామెడీ షోలకు ఆదరణ పెరిగింది. దాంతోపాటే సైకియాట్రిస్టుల వ్యాపారమూ ఊపందుకుంది. అబ్బే.. ఈ రెండూ వేరువేరు విషయాలు. సంబంధమే లేదు. కారణం మాత్రం ఒకటే. ఒత్తిడి’ అంటాడు రాజశేఖర్ తనదైన శైలిలో.
రాజకీయ వ్యంగ్యాస్త్రాలు, మొగుడూ పెండ్లాల కొట్లాటలు, ప్రేమికుల గిల్లికజ్జాలు, నేటి తరం పోకడలు, వెర్రితలలువేసే అలవాట్లు.. అన్నీ మామిడన్నకు ముడిసరుకులే. హాస్యంతోపాటు ఆలోచననూ పంచే సామాజిక అంశాలకూ పెద్దపీట వేస్తాడు. ప్రతి షోకూ ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాసుకోవడం తన అలవాటు. ప్రేక్షకుల స్పందనలను గమనిస్తూ షోను రక్తికట్టిస్తుంటాడు. ఇప్పటి వరకూ ఎవరూ కామెడీకి సైన్స్‌ను జోడించలేదు. ఆ విభాగంలోనూ నవ్వులు పూయిస్తూ ‘సైన్స్ ఇట్ అప్’ పేరిట ప్రదర్శనలు ఇస్తున్నాడు మామిడన్న.
Read More :
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”