మహేష్‌బాబు-రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వస్తున్నది. యస్యస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఈ సినిమా కథా నేపథ్యమేమిటన్నది అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నది. హనుమంతుడి స్ఫూర్తితో హీరో మహేష్‌బాబు పాత్రను డిజైన్ చేశారని గతంలో కథనాలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం భారతీయ ఇతిహాసం రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టం ఆధారంగా ఈ కథను సిద్ధం చేశారని తెలుస్తున్నది.
రామరావణ యుద్ధంలో మూర్చ పోయిన లక్ష్మణుడిని స్పృహలోకి తీసుకురావడానికి హనుమంతుడు సంజీవని కోసం హిమాలయాలకు బయలుదేరతాడు. అక్కడి ద్రోణగిరి పర్వతాన్ని పెకిలించి లంకకు తీసుకొచ్చి సంజీవనితో లక్ష్మణుడికి మెలకువ తెప్పిస్తాడు. ఈ సంజీవని ఎపిసోడ్ రామాయణ ఇతిహాసంలో ఉద్విగ్నభరితంగా అనిపిస్తుంది.
హనుమంతుడి అచంచల రామభక్తికి, శౌర్యప్రతాపాలకు నిదర్శనంగా నిలుస్తుంది. రామాయణంలో ఈ ప్రధాన ఘట్టం స్ఫూర్తితోనే రాజమౌళి..మహేష్‌బాబు పాత్రను డిజైన్ చేశారని, ఆయన ఇందులో ఓ మహోన్నత లక్ష్యం కోసం ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది.