Rajamouli | కొందరికి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. విచక్షణ మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో కొంతమంది అభిమానుల్లో కామన్ సెన్స్ కొరవడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల పట్ల ప్రవర్తించే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణించడంతో ఆయనకు నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. అయితే, అక్కడ ఉన్న కొంతమంది అభిమానులు వారితో అనుచితంగా ప్రవర్తించారు. నటుడు ఎన్టీఆర్ కోట గారి గురించి భావోద్వేగంగా మాట్లాడి బయటకు వెళ్లే సమయంలో, కొంతమంది “జై ఎన్టీఆర్” అంటూ నినాదాలు చేయడం విచారకరం.
చావు ఇంటి దగ్గర ఇలా ప్రవర్తించడం ఎన్టీఆర్ కి నచ్చలేదు. “అలా చేయొద్దు” అంటూ వారిని ఆపుతూ “జై కోట” అని నినాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా నివాళులర్పించేందుకు వచ్చారు. తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కోట గారి సేవలను గుర్తు చేసుకున్నారు. అయితే, ఆయన వెళ్లిపోతున్న సమయంలో కొంతమంది అభిమానులు సెల్ఫీల కోసం వెంబడించడం మొదలుపెట్టారు. ఒక అభిమాని మాత్రం రాజమౌళికి అడ్డంగా వచ్చి సెల్ఫీకి ట్రై చేయగా, చిర్రెత్తిపోయిన దర్శకుడు అతడిని తోసి “ఏం రా ఇది… ఫోటోలు తీయాలంటే ఇదే టైమా?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఇలాంటి వాళ్లకి రెండు తగిలిస్తేనే బుద్ధి వస్తుంది” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే “ఇలాంటివారిని సమయోచితంగా హ్యాండిల్ చేయడంలో బాలకృష్ణ, మోహన్‌బాబు లాంటోళ్లే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. ఇక దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం తీస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.