Raj Kapoor bungalow | సుప్రసిద్ధ నటుడు, నిర్మాత రాజ్ కపూర్ చెంబూర్ బంగ్లా అమ్ముడుపోయింది. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ ఐకానిక్ బంగ్లాను రూ.100 కోట్లకు గోద్రేజ్ గ్రూపు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఈశాన్య ముంబై శివారులోని చెంబూర్‌లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ప్రక్కనే డియోనార్ ఫామ్ రోడ్లో ఈ బంగ్లా ఉన్నది. ఈ బంగ్లా స్థానంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో ప్రసిద్ధ ఆర్కే స్టూడియోను కూడా గోద్రెజ్ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఈ బంగ్లాతో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని రాజ్ కపూర్ తనయుడు రణధీర్ కపూర్ చెప్పారు. ఇది మా కుటుంబానికి చాలా విశేషమైనదని పేర్కొన్నారు. గోద్రెజ్ కుటుంబం ఈ గొప్ప వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని తాము భాస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కపూర్ కుటుంబానికి గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎండీ గౌరవ్ పాండే ధన్యవాదాలు తెలిపారు. రాజ్ కపూర్ ఐకానిక్ బంగ్లా ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో భాగమని చెప్పాడు. ఈ ప్రాజెక్టు ద్వారా చెంబూరులో గోద్రెజ్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
రాజ్ కపూర్ చాలా ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకున్నాడు. వాటిలో చెంబూర్‌లోని ఆర్కే స్టూడియోస్, బంగ్లా చాలా ప్రసిద్ధమైనవి. ఆర్కే స్టూడియోస్‌ను నాలుగేండ్ల క్రితం విక్రయించగా గోద్రెజ్ సంస్థ సొంతం చేసుకున్నది. ఇప్పుడు ఈ ఐకానిక్ బంగ్లా కూడా గోద్రెజ్ కుటుంబమే దక్కించుకోవడం విశేషం. దాదాపు ఎకరం స్థలంలో విస్తరించిన ఈ బంగ్లాను కూల్చివేసి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును చేపట్టేందుకు గ్రోద్రెజ్ ప్రాపర్టీస్ సిద్ధమవుతున్నట్లు గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ చెప్పారు. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.