బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తే అంత క్షేమంగా పిల్లలు ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. కానీ యాజమాన్యాల నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నది. విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఫిట్నెస్ లేకుండానే రోడ్లపైకి వస్తున్నాయి. ఇటీవల ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో 15 స్కూల్ బస్సులపై కేసులు నమోదయ్యాయి.
ప్రతీ రోజు నగరంలో ఏదో ఒక చోట విద్యా సంస్థల బస్సులు మార్గమధ్యలో రోడ్లపై అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. దీంతో అప్పటికే వెనకాల వస్తున్న వాహనాలు బస్సును ఢీకొట్టాల్సిన ప్రమాకర పరిస్థితులు ఉంటున్నాయి. తాజాగా సికింద్రాబాద్, బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ బడా విద్యా సంస్థలకు చెందిన బస్సులు రోడ్డుపైనే అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వెనకాల వచ్చిన వాహనాలన్నీ ఆగిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ట్రాఫిక్ పోలీసులు చేరుకొని.. మెకానిక్‌ను పిలిపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో 40 నిమిషాలకు పైగా ఆ రూట్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
– సిటీబ్యూరో
గ్రేటర్లో 13,502 విద్యా సంస్థల బస్సులు
గ్రేటర్లో 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 1247, మేడ్చల్ మల్కాజిగిరిలో 6058, రంగారెడ్డిలో 6197 బస్సులు ఉన్నాయి. మొత్తం 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీరికి ఆర్టీఏ ప్రతీ స్కూల్ ప్రారంభానికి ముందర రోడ్ సేఫ్టీ, డ్రైవర్ల నియామక సామర్థ్యం, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బస్సు కండిషన్, ఆ బస్సుపై ఉండాల్సిన రంగులు, అక్షరాలు తదితర అన్నీ అంశాలపై సూచనలు ఇస్తారు. కానీ ఈ సారి ఆర్టీఏ అధికారులు వారికి సూచనలు చేసినప్పటికీ విద్యా సంస్థల నిర్వాహకులు తమదారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రోజు వారీ కూలీగా డ్రైవర్లను నియమించుకుని ఎటువంటి అనుభవం లేకున్నా.. చేతికి స్కూల్ బస్సును ఇచ్చేస్తున్నారు. ఆ బస్సును నడపడానికి వాళ్లంతా మద్యం తాగి రోడ్డుపై ఉరికిస్తున్నారు. ఇలా పోలీసుల తనిఖీల్లో ఇటీవల డ్రైవర్లు కొందరు పట్టుబడిన సంఘటనలు తెలిసిందే.
ఇవి పాటించాల్సిందే..!!
మోటార్ వాహనాల చట్టం ప్రకారం స్కూల్ బస్సు తప్పక పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో 1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), 2. వ్యాలీడ్ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్, 3. వ్యాలీడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 4. పర్మిట్, 5. ట్యాక్స్ పేమెంట్ రశీదు(బకాయిలు లేకుండా), 6. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, 7. డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్సు తప్పక వాహనంతో ఉండాలి.