Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడిగా, పార్టీలో నంబర్ టూ నాయకుడిగా చలామణి అయిన చద్దా, ఏప్రిల్ 24, 2026న తనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులను తీసుకుని కమలం గూటికి చేరడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతి పెరిగిపోయిందని, అక్కడ కొనసాగడం తన వల్ల కాదంటూ ఆయన పార్టీ మార్పుపై వివరణ ఇచ్చినప్పటికీ, ఈ పరిణామం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌పై, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
రాఘవ్ చద్దా బీజేపీ కండువా కప్పుకున్న కేవలం 48 గంటల వ్యవధిలోనే ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఫాలోవర్లు భారీ సంఖ్యలో వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. యువతలో, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) ఓటర్లలో విశేషమైన క్రేజ్ ఉన్న చద్దా నిర్ణయాన్ని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ మారకముందు ఆయనకు సుమారు 1.46 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, బీజేపీలో చేరిన మరుసటి రోజే దాదాపు 10 లక్షల ఫాలోవర్లను కోల్పోగా.. 48 గంటల్లో దాదాపు 18 లక్షల మంది ఆయన్ని అన్‌ఫాలో చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సోషల్ మీడియా చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్లను కోల్పోవడం అరుదైన విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువత సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ‘అన్‌ఫాలో’ క్యాంపెయిన్ నిర్వహించడం ఆయన పాపులారిటీకి పెద్ద దెబ్బగా పరిణమించింది. ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఆయనను ఆరాధించిన అభిమానులు, ఇప్పుడు ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని ఒక అవకాశవాద చర్యగా భావిస్తూ తమ నిరసనను డిజిటల్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ పరిణామం రాఘవ్ చద్దా రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
View this profile on Instagram