Radhika | ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. అప్పట్లో చాలా సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ అలరిస్తుంది. అయితే రాధిక శరత్‌కుమార్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆమెను జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా, వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.దినమలర్ అనే తమిళ మీడియా కథనం ప్రకారం, రాధిక ఆరోగ్యాన్ని వైద్యులు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేకంగా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా, పూర్తి కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాతే డిశ్చార్జ్ చేసే అవకాశముంది. ఆమె ఆసుపత్రిలో చేరిన వార్త వెలువడగానే అభిమానులు, కోలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో #GetWellSoonRaadhika అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. పలువురు సినీ ప్రముఖులు, సహనటులు ఫోన్ ద్వారా పరామర్శలు తెలియజేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
తెలుగు సినీ ప్రియులకు రాధిక శరత్‌కుమార్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి 16 సినిమాల్లో జంటగా నటించి అదరగొట్టారు. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రాధిక, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించారు. నటిగా మాత్రమే కాకుండా, రాధిక నిర్మాతగా కూడా పలు విజయవంతమైన టీవీ సీరియల్స్ మరియు సినిమాలకు పర్యవేక్షణ చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసారు రాధిక.