పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యూనివర్సిటీ’ (పేపర్‌లీక్) ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, ప్రముఖ కవి నందిని సిధారెడ్డితో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా విద్యారంగంలో జరుగుతున్న పేపర్‌లీక్‌ల వల్ల జరిగే నష్టాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించామని తెలిపారు. గ్రూప్ 1, 2 పరీక్షల్లో ప్రశ్నాపత్రాల్ని లీకులు చేయడం చూస్తుంటే.. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలు ఏమైపోతాయో అని భయం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆటంబాంబులు, సునామీల కంటే పేపర్ లీకేజీలు సమాజానికి, వ్యవస్థకు ఎక్కువ హానిచేస్తానని, కాపీయింగ్ చేసి మార్కులు తెచ్చుకున్న వాళ్లు డాక్టర్లు అయితే రోగుల ప్రాణాలకు భరోసా ఉండదని, అలాంటి వాళ్లు ఇంజనీర్లు అయితే బ్రిడ్జిలు ఎలా నిలబడతాయని ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు జరగకూడదంటే పేపర్ల లీకేజీలను అరికట్టాలని, విద్యను జాతీయం చేసి ప్రైవేట్ మాఫియా నుంచి విముక్తి చేయాలని ఆయన కోరారు. ఆర్.నారాయణమూర్తి, వై.ఎస్.కృష్ణేశ్వర్‌రావు, తిరుపతి నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.