Jagapathi babu | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణిస్తే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు. కానీ ఈ విషయాన్ని తానెక్కడ పబ్లిసిటీ చేసుకోలేదని వివరించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు.
” సినిమా షూటింగ్ ముగించుకుని ఊరి నుంచి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లానని జగపతిబాబు ఆ వీడియోలో తెలిపారు. చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లానని చెప్పారు. అందరి ఆశీస్సులతో త్వరగానే బాలుడు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చానని పేర్కొన్నారు. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది ఆ కుటుంబమే కాబట్టి తన వంతుగా సపోర్టు చేయాలని అనుకున్నానని తెలిపారు. కాకపోతే దాన్ని పబ్లిసిటీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియలేదని అన్నారు. దానిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ వీడియో పెడుతున్నానని చెప్పారు.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయంలో సినీ ప్రముఖులపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. జైలు నుంచి వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు సినిమా వాళ్లు ఇంటి ముందు క్యూ కట్టారని మండిపడ్డారు. అల్లు అర్జున్‌కు కాళ్లు పోయాయా? చేతులు పోయాయా? కిడ్నీలు పాడయ్యాయా? ఎందుకు ఆయన్ను పరామర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఒక ప్రాణం పోతే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని మండిపడ్డారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కూడా సినీ ఇండస్ట్రీపై రెచ్చిపోయి కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే జగపతి బాబు క్లారిటీ ఇస్తూ వీడియో పెట్టడం గమనార్హం.