అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పుష్ప-2’ (ది రూల్) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ చిత్రంలో తాను పోషించిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అల్లు అర్జున్. స్మగ్లర్ పాత్ర అంటే నెగెటివ్ కోణంలో చూస్తారని, అయితే తన క్యారెక్టర్ ప్రభావం మాత్రం ప్రేక్షకులపై పడలేదని అల్లు అర్జున్ తెలిపారు. ‘సుకుమార్ ఈ సినిమా కథ చెబుతూ స్మగ్లర్ పాత్ర అన్నప్పుడు అస్సలు టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా తగ్గింది. పైగా కథానేపథ్యం కూడా 80వ దశకం లోనిది. అందుకే నా పాత్రను ఎవరూ స్ఫూరిగా తీసుకుంటారని అనుకోలేదు. ప్రేక్షకులు చాలా తెలివిగా ఆలోచిస్తారు. సినిమాను సినిమాలాగే చూస్తారు’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. నటుడిగా తాను ప్రయోగాలకు పెద్దపీట వేస్తానని, ‘పుష్ప’ వంటి గొప్ప కథా విస్త్రృతి వున్న పాత్ర ఇప్పటివరకు రాలేదని, కమర్షియల్ చిత్రాల్లో కూడా నటుడిగా కొత్తగా ఆవిష్కరించునే ప్రయత్నంలో ఉన్నానని అల్లు అర్జున్ అన్నారు.