చండీగఢ్: పంజాబీ నటి సోనియా మాన్ (Sonia Mann) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరింది. కీర్తి కిసాన్ యూనియన్ నేత బల్దేవ్ సింగ్ కుమార్తె అయిన ఆమె ఆదివారం ఆమ్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని సభ్యత్వం స్వీకరించింది. ఆప్ పంజాబ్ విభాగం ఈ విషయాన్ని ఎక్స్‌లో పేర్కొంది. ‘కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు ఎస్ బల్దేవ్ సింగ్ కుమార్తె, పంజాబీ నటి సోనియా మాన్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్‌లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబంలోకి ఆమెకు స్వాగతం’ అని పోస్ట్ చేసింది.
కాగా, పంజాబీతోపాటు, హిందీ, మరాఠీ, మలయాళం, తెలుగుతో సహా పలు భాషా చిత్రాల్లో సోనియా మాన్ నటించింది. ఆమె తొలి చిత్రం ‘హైడ్ అండ్ సీక్’. 2014లో ‘కహైన్ హై మేరా ప్యార్’ సినిమాతో హిందీలో తెరంగ్రేటం చేసింది. 2020లో హ్యాపీ హార్డీ, హీర్ చిత్రాల్లో నటించింది.
మరోవైపు 2018లో హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాతో సహా ప్రసిద్ధ సింగర్స్‌తో కలిసి సోనియా మాన్ పని చేసింది. కిసాన్ యూనియన్ నేత అయిన ఆమె తండ్రి బల్దేవ్ సింగ్‌ను 1980లో ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్చి చంపారు.