‘ప్రేమ, లక్ష్యం మధ్య ఉండే సంఘర్షణను ఆవిష్కరిస్తూ మా చిత్రం అందరిని ఆకట్టుకుంటున్నది. తమ జీవితాలను తెరపై చూసినట్లుందని ప్రేక్షకులు భావిస్తున్నారు’ అని అన్నారు కొమ్మాలపాటి సాయిసుధాకర్. ఆయన నిర్మాతగా దినేష్తేజ్, హెబ్బాపటేల్, పాయల్రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ తెరకెక్కించిన ‘అలా నిన్ను చేరి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నిర్మాత మాట్లాడుతూ ‘ప్రేమ, జీవితం తాలూకు క్లిష్టమైన అంశాల్ని చర్చించిన చిత్రమిదని పలువురు ప్రశంసిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం, ఆండ్రూ సినిమాటోగ్రఫీ మా సినిమాకు బలాన్నిచ్చింది. ఈ సినిమాలో నేను చిన్న పాత్రలో కనిపించాను. మా కుటుంబానికి సినీ పంపిణీరంగంతో ఎప్పటి నుంచో సంబంధాలున్నాయి. దాంతో చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఏర్పడింది. నిర్మాతగా విభిన్న చిత్రాలతో ప్రయాణం సాగించాలనుంది’ అన్నారు.