‘ఈ సినిమా విజయంపై ముందు నుంచి నమ్మకం ఉంది. కథ విన్నప్పుడే తప్పకుండా హిట్ అవుతుంది అను కున్నాం’ అన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. ఆయన సమర్పణలో శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సామజవరగమన’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అనిల్ సుంకర మాట్లాడుతూ ‘ప్రీమియర్ షోలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. వాటి వల్ల ఈ సినిమా విజయంపై నమ్మకం ఏర్పడింది. ఇదే కాంబినేషన్లో మళ్లీ సినిమా ఉంటుంది.
ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నాం’ అన్నారు. నిర్మాతగా పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలను కూడా నిర్మించడంపై మాట్లాడుతూ ‘పెద్ద సినిమాల విషయంలో కాంబినేషన్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. చిన్న సినిమాల్లో కొంచెం రిస్క్ ఉంటుంది. అయితే సబ్జెక్ట్ బాగుంటే మాత్రం తప్పకుండా వర్కవుట్ అవుతాయి’ అని చెప్పారు. తమ సంస్థ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ భారీ విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉందని, చిరంజీవిగారితో సినిమా చేయడం తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అనిల్ సుంకర ఆనందం వ్యక్తం చేశారు.