బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి గ్లోబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి-మహేష్‌బాబు చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నది. ఇదిలావుండగా ప్రియాంకచోప్రా ముంబయిలోని విలాసవంతమైన ఫ్ల్లాట్లను విక్రయించిందని ఇండెక్స్ ట్యాప్ అనే సంస్థ వెల్లడించింది. ముంబయి ఆంథేరిలో ఉన్న ఒబెరాయ్ స్కైగార్డెన్ కమ్యూనిటీలోని ఫ్లాట్లను అత్యంత ఖరీదైనవిగా చెబుతారు. ఈ కమ్యూనిటీలో ప్రియాంకచోప్రాకు నాలుగు ఫ్లాట్లున్నాయి. వాటిని దాదాపు 16కోట్లకు ఆమె విక్రయించారని తెలిసింది. రెండేళ్ల క్రితం కూడా ముంబయి లోఖండ్వాలాలో ఉన్న రెండు పెంట్‌హౌజ్‌లను ప్రియాంక చోప్రా విక్రయించింది. భర్త నిక్‌జోనస్‌తో కలిసి లాస్‌ఏంజెలస్‌లో స్థిరపడింది ప్రియాంక చోప్రా. ఈ నేపథ్యంలో ఆమె ముంబయిలో తన ఆస్తులన్నింటినీ విక్రయించే ఆలోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకచోప్రాకు ముంబయితో పాటు గోవా, న్యూయార్క్, లాస్ఏంజెలెస్లో విలాసవంతమైన సొంత భవంతులు ఉన్నాయి.