తన కన్నా వయసులో చాలా చిన్నవాడిని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తల్లయింది. ఈ విషయాన్ని ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో వెల్లడించారు. సరోగసీ ద్వారా పసికందుకు తల్లయినట్లు ప్రియాంక వెల్లడించింది. తన భర్త నిక్‌ను ట్యాగ్ చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది.
‘‘సరోగసీ ద్వారా బిడ్డను కుటుంబంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించడానికి చాలా సంతోషిస్తున్నా. మా కుటుంబంపై ఫోకస్ పెడుతున్న ఈ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలని మర్యాదగా అడుగుతున్నాం’’ అని ఆమె పోస్టు చేసింది. ప్రియాంక భర్త నిక్ కూడా ఇదే పోస్టును షేర్ చేశాడు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా అక్కడ పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
తాజాగా మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ చిత్రంలో కీలకపాత్రలో నటించింది. ప్రియాంక, నిక్ ఇద్దరూ 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం ప్రియాంక తన ఇన్‌స్టా ఖాతాలో జోనాస్ ఇంటిపేరు తొలగించడం పెద్ద దుమారం రేపింది.
ఈ భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ట్విట్టర్ హ్యాండిల్ ఉన్న పేరే ఇన్‌స్టాకు కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే తాను భర్త ఇంటి పేరు జోనాస్‌ను తన పేరు చివర తొలగించినట్లు ప్రియాంక ఆ తర్వాత వివరణ ఇచ్చింది.