నగరాల్లో మిద్దె తోటలు, బాల్కనీల్లో మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపేవాళ్లు ‘మట్టి’తోనే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. నగరాల్లో మట్టి దొరకడం కష్టం కావడంతోపాటు వర్షానికి మట్టి మొత్తం ఇంట్లోకి చేరుతుంటుంది. ఈ సమస్యకు కోకోపిట్ (కొబ్బరి పొట్టు) అద్భుత పరిష్కారం చూపుతుంది. ఇది మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచడంతోపాటు ఎక్కువ మొత్తంలో తేమను నిలుపుకొంటుంది. కాబట్టి, కుండీలు, బాల్కనీ మొక్కలకు ఎంతో ఉపయోగపడుతుంది.
గట్టిగా ఉండే నేలలో మొక్కల వేర్లు సరిగ్గా విస్తరించలేవు. నీరు కూడా లోపలికి వెళ్లదు. కోకోపిట్ వాడటం వల్ల.. ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఇది మట్టిని గుల్లగా, తేలికగా చేస్తుంది.
చాలా మెత్తగా ఉండే కోకోపిట్.. మట్టి కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. దాంతో సూక్ష్మమైన వేర్లు, మొలకెత్తే విత్తనాలు సరిగ్గా ఎదగడానికి తోడ్పడుతుంది.
కుండీల్లోని మొక్కలకు నీరు తగ్గితే చనిపోతాయి. అయితే, పాటింగ్ మిశ్రమంలో కోకోపిట్ను చేర్చడం వల్ల.. మొక్కలను కాపాడుకోవచ్చు. ఇది తేమను ఎక్కువ సమయం నిలుపుకొంటుంది. ఎక్కువగా ఎండ, వేడి తగిలే బాల్కనీ తోటలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కుండీలను మట్టితో నింపడం వల్ల.. బరువు ఎక్కువగా ఉంటుంది. వాటిని మార్చడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే కుండీలో మట్టితోపాటు కోకోపిట్ కూడా నింపితే.. చాలా తేలికగా మారిపోతుంది. ముఖ్యంగా హ్యాంగింగ్ బాస్కెట్లు, తరచూ అటూఇటూ మార్చాల్సిన కుండీలను వాడుతున్నట్లయితే.. కోకోపిట్ను ఆశ్రయించాల్సిందే!
ఇది మొక్కల వేర్లకు దృఢత్వాన్ని ఇస్తూ, అధిక తేమను నిలుపుకోగలదు. కాబట్టి, హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో మొక్కలు పెంచేవారికీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కోకోపిట్లో పోషకాలు ఉండవు కాబట్టి, మొక్కలకు పోషక ద్రావణం, ఇతర పోషకాల వనరులను అందించాల్సి ఉంటుంది. సరైన పరిస్థితులు కల్పిస్తే కూరగాయలు, ఇతర మొక్కలను పెంచడానికి ఇది అద్భుతమైన మాధ్యమంగా పనిచేస్తుంది.