ఇంట గెలిచి రచ్చ గెలిచిన కథానాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న ఏకైక భారతీయ నటీమణి ఆమె. ప్రస్తుతం ‘SSMB 29’ కథానాయికగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ కానున్నది ఈ అందాలభామ. ఇదిలావుంటే.. ప్రస్తుతం బాలీవుడ్లో హీరోయిన్ల పరిస్థితి గురించి ఈమె మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. ఇందులో ఆమె బాలీవుడ్లో మేల్ డామినేషన్ గురించి మాట్లాడారు. ‘ఇక్కడంతా మగాళ్ల ఆధిక్యమే. నిజానికి మేం హీరోలకు ఏ విషయంలోనూ తీసిపోం.
వారెంత కష్టపడతారో మేమూ సెట్స్‌లో అంతే కష్టపడతాం. కానీ వాళ్లకిచ్చిన దాంట్లో పదోశాతం కూడా మా పారితోషికం ఉండదు. సెట్లో మేం గంటల తరబడి ఎదురుచూస్తుంటే, షాట్‌కి ఎప్పుడు రావాలో హీరో నిర్ణయిస్తాడు. కానీ హాలీవుడ్లో ఈ పరిస్థితి లేదు.’ అంటూ వ్యాఖ్యానించారు ప్రియాంక. కెరీర్ ప్రారంభంలో రంగు విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నానని, ఛాయ తక్కువ కావడంతో అవకాశాలు వచ్చేవి కావని, దాంతో తోటి నటులకంటే ఎక్కువ కష్టపడాల్సివచ్చిందని ప్రియాంక గుర్తు చేసుకున్నారు.