Premante Movie | టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘ప్రేమంటే’. ‘థ్రిల్-యు ప్రాప్తిరస్తు’ ఉపశీర్షిక. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మిస్తున్నారు. సుమ కనకాల కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. కొత్తగా పెళ్లి అయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదా సంఘటనలు, సంతోషాల కలబోతగా ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘లైఫ్ అంతా ఇలానే ఉంటే బాగుండు కదా.. రోజూ హనీమూన్లాగా..’ అనే డైలాగ్ మెప్పించింది. ప్రియదర్శి తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సుమ కనకాల కానిస్టేబుల్ పాత్రలో కనిపించింది. ఆద్యంతం హాస్యప్రధానంగా ట్రైలర్ మెప్పించింది. సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.