Ibrahim Ali Khan | మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి కాజోల్, సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సర్జమీన్ (Sarzameen). బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో జూలై 25న నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ధైర్యవంతుడైన ఆర్మీ అధికారిగా కనిపించారు. దేశాన్ని కాపాడటానికి ఉగ్రవాదులతో పోరాడే సైనికుడి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంది. కాజోల్ పృథ్వీరాజ్ భార్యగా, ఓ తల్లిగా ఎమోషనల్ పాత్రలో నటించారు. కుటుంబం, దేశభక్తి మధ్య ఆమె పడే సంఘర్షణను అద్భుతంగా చూపించారు. ఇక సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ప్రధానంగా కాశ్మీర్ నేపథ్యంలో దేశభక్తి, త్యాగం, మానవ సంబంధాల మధ్య ఉండే సంఘర్షణల చుట్టూ తిరుగుతుంది.