Preity Zinta | న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ అవినీతి కుంభకోణం నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ పార్టీ తనపై చేసిన ఆరోపణలను బాలీవుడ్ నటి ప్రీతిజింటా ఖండించింది. బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు ప్రతిఫలంగా న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో ప్రీతిజింటా తీసుకున్న 18కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని కేరళ కాంగ్రెస్ సోషల్‌మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. బ్యాంక్ ఖాతాదారులు తమ డబ్బుల కోసం రోడ్లపైకి వస్తుంటే, ప్రీతిజింటా మాత్రం తన సోషల్‌మీడియా అకౌంట్లను బీజేపీకి అప్పగించి రుణాన్ని మాఫీ చేయించుకుందని కేరళ కాంగ్రెస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వీటిపై ప్రీతిజింటా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించింది.
పదేళ్ల క్రితమే తాను ఆ లోన్ మొత్తాన్ని చెల్లించానని, కేరళ కాంగ్రెస్ తనపై దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడింది. ‘ఓ రాజకీయ పార్టీ నా ఫొటోలను ఉపయోగిస్తూ ఇలాంటి అబద్ధపు ప్రచారానికి దిగడం నన్ను షాక్‌కు గురిచేసింది. నా సోషల్‌మీడియా అకౌంట్లను నేనే చూసుకుంటాను. ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని మానుకోండి.
పదేళ్ల క్రితమే 18 కోట్ల లోన్‌ను చెల్లించాను. ఎలాంటి వివాదానికి ఆస్కారం లేకుండా నా పోస్ట్ అందరి సందేహాలను నివృత్తి చేస్తుందని భావిస్తున్నా’ అని ప్రీతిజింటా ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఆమె పోస్ట్‌పై కేరళ కాంగ్రెస్ ప్రతిస్పందించింది. రుణమాఫీ విషయంలో తమ వ్యాఖ్యలు తప్పయితే సరిదిద్దుకుంటామని తెలిపింది.