ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆగస్ట్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్‌నీల్.
పీరియాడిక్ కథాంశంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ఇందులో బంగ్లాదేశ్‌లో కష్టాలు అనుభవిస్తున్న తెలుగు వలసదారులను రక్షించే పోరాట యోధుడిగా ఎన్టీఆర్ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని తెలిపారు. సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మైథలాజికల్ టచ్ ఉన్న యాక్షన్ సినిమా కాదని ప్రశాంత్‌నీల్ స్పష్టతనిచ్చారు.
ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించే అవకాశముందని వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హిందీ మల్టీస్టారర్ ‘వార్-2’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా అనంతరం ఆయన ‘డ్రాగన్’ షూట్లో జాయిన్ అవుతారు.