‘వారణాసి’ చిత్రంలో తాను పరమ శివ భక్తుడి పాత్రలో నటిస్తున్నానని ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకు కీలక షెడ్యూల్స్‌లో తాను భాగమయ్యానని ఆయన చెప్పారు. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’ ప్రస్తుతం జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ పాత్ర గురించి సోషల్‌మీడియాలో అనేక వార్తలు ప్రచారమవుతున్నాయి. తాజాగా వీటిపై ప్రకాష్‌రాజ్ స్పష్టతనిచ్చారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్‌బాబు తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్ కనిపిస్తారని, కథాగమనంలో ఆయన పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. భారతీయ పురాణాల నేపథ్యంలో సాహసగాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు రుద్ర పాత్రను పోషిస్తున్నారు. రామాయణ నేపథ్యంలో సాగే ఓ ఎపిసోడ్లో మహేష్‌బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది.