సినీ రంగంపై రాజకీయ జోక్యం ఎక్కువైందని జాతీయ నటుడు ప్రకాశ్‌రాజ్ ధ్వజమెత్తారు. 17వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చలనచిత్రోత్సవాల్లో రాజకీయ జోక్యంపై ఆయన మాట్లాడారు. చలనచిత్రోత్సవాలు, సాహిత్యోత్సవాల ఉద్దేశం విభిన్నమైన ఆలోచనలు పంచుకోవడానికేననీ, కానీ అది గాడి తప్పుతున్నదని ప్రకాష్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినిమా, సాహిత్య రంగాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందనడానికి పాలస్తీనా సినిమాల నిషేధమే నిదర్శనం. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా అమోదయోగ్యం కాదు. రాష్ట్రప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటున్నా. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పాలస్తీనా సినిమాలను కూడా తమ చిత్రోత్సవాలలో ప్రదర్శించింది కేరళ ప్రభుత్వం. ఆ దిశగా కర్ణాటక ప్రభుత్వం కూడా అడుగులేయాలి. పాలస్తీనా సినిమాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాలి’ అని ప్రకాశ్‌రాజ్ కోరారు. బెంగళూరులో జరుగతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 6 వరకూ కొనసాగనుంది.