అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో ‘అడవిరాముడు’ అనే సినిమా చేశారు ప్రభాస్. ఆ సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ క్లాసిక్”అడవిరాముడు’లోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ పాటను రీమిక్స్ చేశారు. పాట హిట్ అయ్యిందికానీ.. సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ ప్రభాస్ రీమిక్స్‌ల జోలికి పోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన రీమిక్స్‌లో నర్తించనున్నట్టు తాజా సమాచారం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమాలో ఈ రీమిక్స్ ఉంటుందని తెలుస్తున్నది. ఇంతకీ అది ఏ పాట? అనే విషయానికొస్తే.. సాధారణంగా ప్రభాస్ సినిమాలో రీమిక్స్ సాంగ్ అంటే.. ఆయన పెదనాన్న కృష్ణంరాజు సినిమాల్లోని ఏదోఒక హిట్ సాంగ్ అయ్యుంటుందని అందరూ భావిస్తారు.
అయితే.. దర్శకుడు మారుతి ఆలోచన అందుకు భిన్నంగా ఉంది. తెలుగు పాటల జోలికి పోకుండా.. హిందీ హిట్ సాంగ్‌ని ఆయన రీమిక్స్ చేయబోతున్నారట. సంజయ్‌దత్ హీరోగా 1994లో వచ్చిన ‘ఇన్సాఫ్ అప్నే లాహూ సే’ సినిమాలోని ‘హవా హవా..’ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారట మారుతి. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాట రీమిక్స్ చేయడానికి అది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు. ఒకవేళ ఆయన కూడా ఈ పాటలో ఉంటారేమో!?.