బాలీవుడ్ చిత్రసీమలో కథాంశాల పరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కృతిసనన్. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో సీత పాత్రలో నటిస్తున్నది. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కృతిసనన్. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తన ప్రతిభాపాటవాలను పరిశ్రమ గుర్తించిందని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడం వల్ల సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేశా. తొలి నాలుగేళ్లు భారంగా గడచిపోయాయి. ‘బరేలీ కి బర్ఫీ’ చిత్రంతో నా ప్రతిభ ఏమిటో తెలిసింది. ఆ తర్వాత లుకా చుప్పీ, మిమి చిత్రాలు కెరీర్‌కు బ్రేక్‌నిచ్చాయి. ప్రస్తుతం చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత నా ప్రతిభకు తగిన ఫలితం లభించింది. ప్రతీ సినిమాకు తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా’ అని పేర్కొంది. ఆమె ప్రభాస్ సరసన నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.