ప్రముఖ కథానాయిక కియారా అద్వాణీ తల్లయ్యారు. బుధవారం ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు కొద్ది మాసాల క్రితం కియారా అద్వాణీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా దంపతు లు ప్రకటించారు.
‘షేర్షా’ (2021) సినిమాలో ఈ జంట తొలిసారి కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్లో వారిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కియారా అద్వాణీ ఆ తర్వాత ‘వినయ విధేయ రామా’ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న ‘వార్-2’ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.