బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (32) మృతిచెందారు. కొంతకాలంగా సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. పూనమ్ మరణం గురించి శుక్రవారం ఉదయం ఆమె ఇన్‌స్టా ఖాతాలో వ్యక్తిగత సిబ్బంది పోస్ట్ చేయడంతో ఈ విషయం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో ‘నషా’తో బాలీవుడ్లో నటిగా ప్రయాణం ప్రారంభించారు.
తెలుగులో తీవ్రవాదం ఆధారంగా తెరకెక్కిన ‘మాలినీ అండ్ కో’లో నటించారు. ప్రముఖ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్ తొలి సీజన్లో పాల్గొన్నారు. 2011 వన్డే ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా ‘ఇండియా ఫైనల్ మ్యాచ్ గెలిస్తే నేను దుస్తులు తొలిగిస్తా’.. అంటూ చేసిన ఓ ప్రకటనతో ఆమె చాలా పాపులర్ అయ్యారు. పూనమ్ వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పోలీసు కేసు పెట్టారు. తర్వాతి రోజుల్లో ఆయన నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.