Poonam Kaur | తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలకన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు అనిపించిన విషయాలపై నిర్భయంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. తరచూ వైరాగ్యంతో, ఎవరో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లుగా పోస్టులు పెట్టడం ద్వారా హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంతకుముందు కూడా పూనమ్ కౌర్ ‘గురూజీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన పోస్టులు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్లో దర్శకుడు త్రివిక్రమ్‌ను అభిమానులు ‘గురూజీ’ అని పిలుస్తుండటంతో, ఆ ట్వీట్స్ ఆయననే ఉద్దేశించినవేనని అప్పట్లో నెటిజన్లు భావించారు. అయితే ఈసారి మాత్రం నేరుగా త్రివిక్రమ్ మాట్లాడిన వీడియోపై పూనమ్ రియాక్ట్ కావడం మరింత సంచలనంగా మారింది. వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రీరిలీజ్ కానున్న నేపథ్యంలో, నిర్మాత స్రవంతి రవి కిషోర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ, “కొన్ని సినిమాలు డబ్బు, పేరు తీసుకొస్తాయి.. కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను పలువురు ఫిలిం జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోలపై స్పందించిన పూనమ్ కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “స్త్రీలను మానసిక క్షోభకు గురిచేసి, ఏమీ తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను. మీలాంటి మీడియా అతనికి మద్దతు ఇవ్వడం వల్ల, అలాగే ‘మా’ (MAA) అసోసియేషన్ లాంటి వారు ఇలాంటి వారి బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించకపోవడం వల్లే ఇది సాధ్యమవుతోంది. సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్‌ను పట్టుకుని గొప్పగా షేర్ చేస్తున్నారు. మీలాంటి వారి వల్లే మహిళలపై వేధింపులు పెచ్చుమీరుతున్నాయి” అంటూ పూనమ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్లో పూనమ్ కౌర్ త్రివిక్రమ్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన మాట్లాడిన వీడియో కిందనే స్పందించడం వల్ల ఈ కామెంట్స్ ఆయనను ఉద్దేశించే చేసినవేనని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, తీవ్ర చర్చకు దారి తీసింది.