హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఒకప్పటి బాధితురాలు, నటి పూనమ్‌కౌర్ ఎక్స్‌లో స్పందించారు. ఓ లైంగిక వేధింపుల కేసులో డాన్స్ మాస్టర్ జానీపై తాజాగా సినీపెద్దలు స్పందించడంతో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను సైతం ప్రశ్నించాలని ఆమె కోరింది. గతంలో తనపై వేధింపులు జరిగిన నేపథ్యంలో సినీపెద్దలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, ఎవరూ సహకరించలేదని చెప్పుకొచ్చింది. రాజకీయంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ట్వీట్లో పేర్కొన్నది. డైరెక్టర్ త్రివిక్రమ్, ఓ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు తనను లైంగికంగా వేధించారంటూ గతంలో పూనమ్‌కౌర్ ఆరోపించిన విషయం తెల్సిందే.