ప్రస్తుతం పూజాహెగ్డే దక్షిణాది చిత్రసీమపైనే పూర్తిగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా తెలుగులో పూర్వ వైభవం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ పరిస్థితులపై ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రస్తుతం థియేట్రికల్ సినిమా చాలా ఇబ్బందుల్లో ఉందని, విడుదలైన వెంటనే కంటెంట్ ఎలాంటిదో ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వస్తున్నారని, ఫేక్ ఎంటర్టైన్మెంట్తో వారిని మభ్యపెట్టడం సాధ్యం కాదని చెప్పింది. నేడు వినోదానికి అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయని, ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే కథలో బలమైన ఉద్వేగాలు ఉండాలని అభిప్రాయపడింది.
కమర్షియల్ సినిమాల్లో నటించడం చాలా సులభమని అనుకుంటారని, కానీ వాటిలోనే ఎన్నో సవాళ్లుంటాయని పూజా హెగ్డే చెప్పింది. ‘మంచి కథలో అభినయంపై దృష్టిపెడితే సరిపోతుంది. కానీ కమర్షియల్ సినిమా అలా కాదు. గ్లామర్‌తో పాటు డ్యాన్స్, ఎమోషన్స్..ఇలా అన్ని అంశాల్లో సమతుల్యం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికంటే కమర్షియల్ సినిమానే పెద్ద చాలెంజ్’ అని పూజాహెగ్డే చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో దుల్కర్ సల్మాన్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. శర్వానంద్ ‘జార్జ్‌క్రిష్’ చిత్రంలో కూడా ఆమెనే నాయికగా ఖరారయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.