బుట్టబొమ్మ పూజా హెగ్డేకు హిట్ అనేది పలకరించి దాదాపు అయిదేళ్లు కావస్తుంది. ‘అల వైకుంఠపురం’ తర్వాత ఆమెకు హిట్ లేదు. కానీ అవకాశాలు మాత్రం తలుపు తడుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే అందమే అందుకు కారణం కావొచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ అగ్ర నటుడు విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’లో హీరోయిన్గా నటిస్తున్నది. అలాగే లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘కాంచన 4’ లోనూ ఈ బుట్టబొమ్మే కథానాయిక.
రీసెంట్గా సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమా స్పెషల్ సాంగ్‌లో కూడా పూజా నర్తించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ అందాలభామను మరో అద్భుత అవకాశం వరించిందట. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు హరి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైనట్టు తెలుస్తున్నది. అదే నిజమైతే.. పూజా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.