Shilpa Shetty | ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం కేసు (cheating case)లో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (Raj Kundra) నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా ఈ కేసు తాజాగా కీలక మలుపు తీసుకుంది.
నిధుల మళ్లింపులో నలుగురు కీలక వ్యక్తులను దర్యాప్తు బృందం గుర్తించింది. రాజ్ కుంద్రా కంపెనీ బెస్ట్ డీల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న నలుగురు ఉద్యోగులకు ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం సమన్లు పంపింది. వీరిలో ఒకరు ఇప్పటికే దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరైనట్లు తెలిసింది. సదరు ఉద్యోగిని ప్రశ్నించిన అధికారులు స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మిగతా ముగ్గురు ఉద్యోగులు త్వరలోనే విచారణకు హాజరు కానున్నట్లు పేర్కొన్నాయి.
శిల్పా శెట్టి దంపతులు రూ.60 కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇటీవలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన కంపెనీ 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి రూపంలో రూ.60.4 కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని తెలిపారు. ఈ సొమ్మును వీరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులోని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం మూతపడింది.
దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టిని అధికారులు విచారించారు కూడా.
Also Read..
Yami Gautam | 8 గంటల పని షిఫ్ట్.. దీపికాకు మద్దతుగా నిలిచిన యామి గౌతమ్
Singer Chinmayi | గాయని చిన్మయిపై అసభ్యకర వ్యాఖ్యలు.. సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన సింగర్
Baahubali | బాహుబలి – కన్నప్ప ఫ్రెండ్స్ వెర్షన్ వీడియో వైరల్.. ఫన్నీ ఎడిట్ అదిరిందిగా..!