Yami Gautam | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే (Deepika Padukone) సినిమా షూటింగ్‌ల సమయంలో రోజుకు 8 గంటల పని షిఫ్ట్ (Work Shift) కోరడంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే పలు సినిమాలను కూడా వదులుకుంది ఈ భామ. అయితే ఈ వివాదంపై తాజాగా నటి యామి గౌతమ్ (Yami Gautam) స్పందిస్తూ దీపికాకు మద్దతు తెలిపింది. షూటింగ్లో టైం లిమిట్ అనేది.. నటుల అవసరాలు, నిర్మాణ పరిస్థితులను బట్టి మారుతుందని ఆమె స్పష్టం చేసింది.
సినిమా షూటింగ్లో సమయ పరిమితి అనేది నటులకి, దర్శకుడికి, నిర్మాతకు మధ్య ఉండే పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన నిర్ణయం. ఇతర రంగాల్లో ఉన్నట్లుగా మన సినీ పరిశ్రమ కొంచెం భిన్నంగా ఉంటుంది. లొకేషన్లు, పర్మిషన్లు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లతో సమన్వయం… ఇలా చాలా అంశాలు ఉంటాయి. అందుకే ఇక్కడ సమయపాలన విషయంలో పక్కా నిబంధనలు పెట్టడం కష్టం. కొంతమంది నటీనటులు ఎన్నో ఏళ్లుగా రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు. నటులు, నిర్మాతలు ముందుగానే మాట్లాడుకొని దీనిని నిర్ణయించుకుంటారు. ఒక మహిళా నటి ఈ డిమాండ్ చేస్తేనే అది పెద్ద వివాదంలా ఎందుకు మారుతోందో అర్థం కావడం లేదు. నటులు తమ పని గంటల గురించి అడగడంలో ఎలాంటి తప్పు లేదు. షూటింగ్‌కి అది అనుకూలంగా ఉంటే ముందుకు వెళ్లవచ్చు. లేకపోతే లేదంటూ యామి చెప్పుకోచ్చింది.
తల్లి అయిన తర్వాత దీపికా పదుకొనే కేవలం 8 గంటల పని షిఫ్ట్‌ను డిమాండ్ చేయడంతోనే ఆమెకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాల్సిన ‘స్పిరిట్’ (ప్రభాస్ సరసన) సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. దీంతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంశంపై బాలీవుడ్లో పెద్ద చర్చ మొదలైంది. దీపికా డిమాండ్‌ను పలువురు బాలీవుడ్ నటులతో పాటు టాలీవుడ్ నటులు కూడా సమర్థించగా తాజాగా యామి గౌతమ్ కూడా మద్దతును ప్రకటించింది.