Darshan | రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) తూగుదీపకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు గత నెలలో రద్దు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే దర్శన్‌ను ఆగస్టు 14న మళ్లీ అరెస్ట్ చేశారు. పోలీసులు దర్శన్‌తోపాటు అతని స్నేహితురాలు పవిత్రగౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్ర కారాగారంలో ఉన్నాడు దర్శన్. అయితే ఈ కేసులో మంగళవారం సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యాడు దర్శన్.
దర్శన్ విచారణ సందర్భంగా తాను చాలా రోజులుగా బయటి వెలుతురు (సూర్యకాంతి)ని చూడలేదని.. తనకు విషం ఇవ్వాలని కోర్టును కోరాడు. చాలా రోజులుగా జైలు నుంచి బయటకు వెళ్లేందుకు తనకు అనుమతివ్వడం లేదన్నాడు. వెలుతురుకు దూరమవడంతో తన చేతులకు ఫంగస్ సోకిందని, దుస్తులు దుర్వాసన వస్తున్నాయని.. జైలులో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. దయచేసి కోర్టులో తనకు విషం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని జడ్జిని విజ్ఞప్తి చేశాడు దర్శన్. విషం కేవలం తనకు మాత్రమేనని.. ఇతర నిందితులకు కాదని.. జైలులో ఇబ్బందికర పరిస్థితుల్లో తాను జీవించలేకపోతున్నానని వాపోయాడు.
దర్శన్ విజ్ఞప్తికి స్పందించిన జడ్జి కోర్టులో అలాంటి డిమాండ్స్ ఏం చేయొద్దని సూచించాడు. అయితే ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత జైలు శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తామని జడ్జి దర్శన్‌కు నిర్దేశించారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 19కు వాయిదా వేసింది.
గతంలో హత్య కేసు విచారణ సాగిందిలా..
రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్‌తోపాటు అతని స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్‌తోపాటు మిగిలిన వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో నిందితులపై ఛార్జీషీట్ దాఖలు చేసిన పోలీసులు 24వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట నివేదిక సమర్పించారు. రేణాకాస్వామి తనను క్షమించాలని వేడుకుంటుండగా.. దర్శన్ గ్యాంగ్ కనికరించకుండా దారుణంగా కొట్టి చంపారంటూ కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి.
రేణుకాస్వామిపై దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో దర్శన్ అంగీకరించాడు. తాను రేణుకా స్వామి ఛాతీ, మెడ, తలపై కొట్టానని పేర్కొన్న దర్శన్.. నటి పవిత్ర గౌడను కూడా చెప్పుతో కొట్టమని అడిగానని విచారణలో పోలీసులకు చెప్పాడు. నేనతడి మెడతోపాటు ఛాతీ, తలపై తన్నడమే కాదు.. అతన్ని చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీం దారుణంగా హత్య చేసిందని తేలింది.
పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన దాఖలు చేసిన 3,991 పేజీల ఛార్జిషీట్లో ఏ1గా హీరోయిన్ పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్ పేర్లను పేర్కొన్నారు.
సిట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేదికలను సైతం చార్జిషీట్లో ప్రస్తావించింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 50 మందికిపైగా పోలీసులు, ఎనిమిది మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు.
Manisha Koirala | ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం.. నేపాల్‌లో పరిస్థితులపై మనీషా కొయిరాలా పోస్ట్..!
Siva Karthikeyan | తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రాకపోవడానికి కారణం అదే: శివకార్తికేయన్
Nandamuri Balakrishna | తొలి దక్షిణాది నటుడిగా.. NSE వద్ద నందమూరి బాలకృష్ణ సందడి