Siva Karthikeyan | ‘మదరాసి’(madharaasi) అంటూ వచ్చి ఇటీవలే సూపర్ హిట్‌ను అందుకున్నాడు తమిళ నటుడు శివ కార్తికేయన్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న శివ కార్తికేయన్ రూ.1000 కోట్ల కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు బాలీవుడ్‌తో పాటు తెలుగు, కన్నడ ఇండస్ట్రీ చిత్రాలు మాత్రమే రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. తమిళం నుంచి ఇప్పటివరకు ఒక్కచిత్రం కూడా రూ.1000 కోట్లు సాధించలేదు. దీంతో కూలీ సినిమాతో ఆ ఆశను నెరవేర్చుకుందాం అనుకున్న తమిళ అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. అయితే తమిళ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు శివకార్తికేయన్.
తమిళ సినిమా రూ.1000 కోట్ల సాధించడం పెద్ద కష్టమేమి కాదని త్వరలోనే ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని శివకార్తికేయన్ తెలిపాడు. ఇప్పటివరకు తమిళ సినిమాలు రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించకపోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ సినిమాలు పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాకపోవడం.. ఒకవేళ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయిన కూడా ఆ సినిమాకు పాజిటిక్ రాకపోవడం అని తెలిపాడు. అలాగే సినిమా టికెట్ ధరలు కూడా కలెక్షన్లపై ప్రభావం చూపుతున్నాయని శివ తెలిపాడు. బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో టికెట్ ధరలు తమిళనాడులో కంటే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తమిళనాడులో కూడా ఎక్కువ ధరలు ఉండి ఉంటే జైలర్ ఎప్పుడో రూ.1000 కోట్ల కలెక్షన్లు దాటి ఉండేదని శివకార్తికేయన్ తెలిపాడు.
సినిమాకు కలెక్షన్లు రావాలని టికెట్ ధరలు పెంచడం తన ఉద్దేశ్యం కాదని.. ఒక సినిమా విజయం సాధించాలంటే ఉత్తర భారతదేశంలోని ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని, అప్పుడే భారీ కలెక్షన్లు సాధ్యమవుతాయని ఆయన అన్నారు. తమిళ చిత్రాలు పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందితే ₹1000 కోట్ల కలెక్షన్లు సాధించడం ఖాయమని శివకార్తికేయన్ తెలిపారు.