Manisha Koirala | పొరుగుదేశమైన నేపాల్‌లో నిరసనలతో అట్టుడుకుతున్నది. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంతో.. వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టారు. ఈ నిరసలు తీవ్రరూపం దాల్చాయి. కీలక నగరాల్లో సైతం ఆందోళనలు మరింత ఉధృతమై విధ్వంసానికి కారణమయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగినా పరిస్థితి అదుపు తప్పింది. ఇప్పటి వరకు ఆందోళనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా సోషల్ మీడియా వేదికగా నేపాల్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రక్తపు మరకలతో ఉన్న షూ ఫొటోను షేర్ చేసింది. ‘ఇది కేవలం ఫొటో కాదు.. నేపాల్‌లో జరుగుతున్న హింసకు సాక్ష్యం. ఇది చాలా భయంకరంగా అనిపిస్తోంది’ అని మనిషా కోయిరాలా కామెంట్ చేశారు.
మనీషా కోయిరాలా నేపాలీ భాషలో ‘నేపాల్‌కు ఇది చీకటి రోజు. ప్రజల గొంతు, అవినీతికి వ్యతిరేకంగా కోపం, న్యాయం కోసం చేసిన డిమాండ్‌కు బుల్లెట్లతో సమాధానం లభించిన రోజు’ అంటూ పోస్ట్ పెట్టారు. నేపాల్‌లో ఓలి ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్లను నిషేధించింది. భద్రత కారణాలను చాకుగా చూపింది. ఈ నిర్ణయంపై జనం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. దానికి తోడు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. స్థానిక యంత్రాంగం నేపాల్ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఖాట్మండుతో పాటు, సున్సరాయ్ జిల్లాలోని లలిత్పూర్ జిల్లా, పోఖారా, బుత్వాల్, ఇటాహరిల్లోనూ కర్ఫ్యూ విధించింది. అయినా, జనం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగించారు. మంగళవారం పార్లమెంట్ భవనంలోకి సైతం నిరసనకారులు ప్రవేశించి నిప్పుపెట్టారు. ప్రధాని ఓలి రాజీనామా చేశారు. ఆయన దుబాయి ఆశ్రయం కోరినట్లు పలు నివేదికలు తెలిపాయి.