‘సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘పిండం’ సినిమా నిరూపించింది. 170 స్క్రీన్స్‌తో మొదలైన ఈ సినిమా 400 స్క్రీన్స్ వరకు వెళ్లింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో చక్కటి స్పందన లభిస్తున్నది’ అని అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఆయన నిర్మాణంలో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ‘పిండం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు.
నిర్మాత మాట్లాడుతూ ‘కేవలం 36 రోజుల్లోనే దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్‌తో పాటు నటీనటులందరూ చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో మా బ్యానర్ కళాహి మీడియాలో మరో సినిమా చేయబోతున్నాం. పొలిటికల్ డ్రామా నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తాం’ అన్నారు. ఈ సినిమా ద్వారా 15 ఏండ్ల తర్వాత తెలుగులో సోలో విజయాన్ని అందుకున్నానని, నిజాయితీగా సినిమా చేస్తే ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని హీరో శ్రీరామ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా అందరి అంచనాలను నిజం చేసిందని దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.