ఇకపై పర్సంటేజీ విధానంలో మాత్రమే సినిమాల్ని ఆడిస్తామని, త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ చిత్రానికి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. సింగిల్ థియేటర్లకు గ్రేడింగ్ అంటూ ఏవో కుంటిసాకులు చూపిస్తూ నిర్మాతలు ఈ సమస్యను సాగదీస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆరోపించారు. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ స్థానంలో జువ్వాడి శేఖర్ రావును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ బాల గోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా టైంలోనే సమస్యను పరిష్కరిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని, కానీ ఏడాది సమయం గడచిపోయినా ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపలేదని ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేశారు. ‘నిర్మాతలు మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ‘పెద్ది’ సినిమాకు మాకు పర్సంటేజీ కావాల్సిందే. సమస్యను మరింత ఆలస్యం చేయడానికి గ్రేడింగ్ అంటూ సాకులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తొలుత మూడు వారాల సమయం చాలన్నారు. ఇప్పుడు ఆరువారాలు కావాలంటున్నారు. ప్రస్తుత తెలుగు ఫిల్మ్ ఛాంబర్..గిల్డ్ ఛాంబర్‌గా మారింది. వారు ఏం అనుకుంటే అదే చేస్తున్నారు’ అని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.
10,15 ఏండ్ల కిందట ఎగ్జిబిటర్లకు మంచి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు మొత్తం పడిపోయిందని, అదే నిర్మాతలకు మాత్రం 14 రకాలుగా ఆదాయం వస్తున్నదని ఎగ్జిబిటర్లు తెలిపారు. ‘ప్రస్తుతం 120 థియేటర్ల ఓనర్లు దయనీయ స్థితిలో ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు పర్సంటేజీ విధానమే అమల్లో ఉంది. ఇక్కడ మాత్రమే రెంటల్ విధానం కొనసాగుతున్నది. సమస్యను పరిష్కరించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారు. థియేటర్ల సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాక, వచ్చే వసూళ్లను బట్టి గ్రేడింగ్ చేయాలి. అలాంటి గ్రేడింగ్‌కు మేము సిద్ధంగా ఉన్నాం. మాకు పర్సంటేజీ విధానం కావాల్సిందే. ఎంత ఇస్తారో త్వరగా తేల్చిచెప్పాలి’ అని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు.
‘తెలంగాణలో ‘పెద్ది’ చిత్రానికి టికెట్ రేట్లను పెంచొద్దని, దానివల్ల ప్రేక్షకులపై భారం పడుతుందని ఎగ్జిబిటర్ల తరపున సీఎం రేవంత్ రెడ్డికి, ఛాంబర్‌కు ఓ లేఖ ఇచ్చాం. ‘పెద్ది’లాంటి సినిమాలను మేం గౌరవిస్తాం. ఆ సినిమాపై మాకు ఎలాంటి పగ లేదు. ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ అయితే మళ్లీ మా సమస్యను ఎప్పుడు పట్టించుకుంటారో తెలియక ‘పెద్ది’కి పర్సంటేజ్ ఇవ్వాలని కోరుతున్నాం. అవసరమైతే అగ్ర నటుడు చిరంజీవి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తాం. ఆయనకు మా బాధలు చెప్పుకుంటాం’ అని ఎగ్జిబిటర్లు అన్నారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ రేట్ల పెంపు అంశం సందిగ్ధంలో పడింది.