Pawan Kalyan | తమిళనాడులో ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్‌తో తన రాజకీయ ప్రయాణాన్ని పోల్చుతూ సోషల్ మీడియాలో వస్తున్న చర్చలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా భిన్నమని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్, తాను పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని గుర్తుచేశారు. అందరూ వదిలేసినా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశానని చెప్పారు. జనసేన ఏ ఒక్క సిద్ధాంతానికి పరిమితమైన పార్టీ కాదని, వివిధ రాజకీయ భావజాలాల్లోని మంచి అంశాలను తీసుకుని పార్టీని నిర్మించామని వివరించారు.
జనసేన పార్టీ ఏర్పాటుపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2008 నుంచే పార్టీ ఎలా ఉండాలి, ఏ దిశగా నడవాలి అనే అంశాలపై ఆలోచనలు ప్రారంభించానని తెలిపారు. జనసేన అనేది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని, దాదాపు పాతికేళ్లుగా తనలో పెరిగిన ఆలోచనకు రూపమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలనే ఆశతో గానీ, పదవుల కోసం గానీ పార్టీ స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమనే ఉద్దేశంతోనే ఈ ప్రయాణం ప్రారంభించానని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జనసేన ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారని కూడా తెలిపారు.
పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి పార్టీల సమన్వయం వంటి అంశాలపై కూడా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు జనసేన సభ్యత్వం తీసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.ఇక తన ఆరోగ్య పరిస్థితిపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. గతంలో కరోనా కారణంగా వచ్చిన ఊపిరితిత్తుల సమస్యలు పూర్తిగా తగ్గలేదని తెలిపారు. రాజకీయ పర్యటనల్లో దుమ్ము, ధూళి వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు. అభిమానులు ప్రేమతో చేతులు పట్టి లాగడం వల్ల భుజాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, వెన్నెముక సమస్యలు ఉన్నప్పటికీ కార్యకర్తలు, అభిమానుల ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్నానని ఆయన తెలిపారు.