Pawan Kalyan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది హరిహరవీరమల్లు పార్ట్ 1, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓజీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రస్తుతం హరిహరవీరమల్లు పార్ట్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పవన్ కల్యాణ్ ఖాతాలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు సంబంధించిన మరో క్రేజీ వార్త నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ సారి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట పవన్ కల్యాణ్. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరనే కదా మీ డౌటు. లోకేశ్ కనగరాజ్.. అన్నీ అనుకున్నట్టు కుదిరితే పవన్ కల్యాణ్ నెక్ట్స్ చేయబోయే కొత్త సినిమా ఇదే కానుందట.
విజయ్‌తో జననాయకుడు, యశ్‌తో టాక్సిస్ లాంటి భారీ సినిమాలను తెరకెక్కిస్తున్న పాపులర్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్ కల్యాణ్, లోకేశ్ కనగరాజ్ కాంబో సినిమాను నిర్మించనుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఇన్సైడ్ టాక్.
ప్రస్తుతానికి ఈ వార్త ఆఫీషియల్ కాకున్నా ఈ అప్డేట్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన కూలీ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినా.. అభిమానులు ఆశించిన స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ లోకేశ్ కనగరాజ్, పవన్ కల్యాణ్‌తో సినిమా ఫైనల్ చేస్తే అది ఖచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.