Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్గా దాదాపు రూ.717 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రిషబ్ శెట్టి దేశంలోని పురాతన ఆలయాలను దర్శించుకుంటూ దైవదర్శనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన బీహార్లోని చారిత్రక ముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.
బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉన్న ముండేశ్వరి దేవి ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరంగా పూజలు జరుగుతున్న హిందూ దేవాలయంగా భావిస్తారు. అయితే రిషబ్ శెట్టి ఈ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పట్టాభిషేక పూజలో కూడా ఆయన పాల్గొని, ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో లీనమయ్యారు.
‘కాంతార’ సినిమా భారతదేశపు సాంస్కృతిక మూలాలతో ముడిపడి ఉన్నందున, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని రిషబ్ కోరుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. చాముండి మాతతో కూడా ఈ చిత్రానికి సంబంధం ఉన్నందున, కృతజ్ఞతగా ఆయన ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ విజయానికి కృతజ్ఞతగా రిషబ్ శెట్టి ఇటీవల ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని, మైసూరులోని చాముండేశ్వరి ఆలయాలను కూడా దర్శించుకున్నారు.