Pawan Kalyan | సినిమా టికెట్ల ధరల పెంపుపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరై మాట్లాడారు. డిమాండ్, సప్లయ్ ఆధారంగానే ధరలను పెంచుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని.. టికెట్ ధర పెంపుతో ప్రభుత్వానికి జీఎస్టీతో ఆదాయం వస్తోందన్నారు. గత ప్రభుత్వం బీమ్లా నాయక్ చిత్రానికి టికెట్ ధరలను పెంచలేదన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకిష్టం లేదన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధే మన నినాదమన్నారు. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపాలన్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు.
కుటుంబంలో ఎందరు హీరోలు వచ్చినా.. మూలం మెగాస్టార్ మాత్రమేనన్నారు. ఇవాళ గేమ్ ఛేంజర్, ఓజీ అయినా.. అన్నీ మొగల్తూరులో మొదలయ్యాయన్నారు. ఇవాళ మమ్మల్ని ఎలా పిలిచినా అన్నింటికి చిరంజీవియే ఆద్యుడని.. మూలాలను మరచిపోకూడదన్నారు. తాను చాలా తక్కువగా సినిమాలకు వెళ్లేవాడినని.. నటుడిని కాక ముందు చెన్నైలో శంకర్ జెంటిల్మెన్ చిత్రం టికెట్‌ను బ్లాక్‌లో కొనుక్కొని చూశానని తెలిపారు. ప్రేమికుడు సినిమాకు మా అమ్మమ్మతో వెళ్లానని.. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్తో పాటు సోషల్ మెసేజ్ ఉంటాయన్నారు. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తుందని.. శంకర్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ బాగానే ఆడాయన్నారు.
శంకర్ తెలుగులో సినిమా తీస్తే బాగుంటుంది అనుకునేవాడినని.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉందన్నారు. తాను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు.. తన వద్ద డబ్బులు లేనప్పుడు నాకు డబ్బులు ఇచ్చి వకీల్ సాబ్ సినిమా చేశారని.. ఆ డబ్బే నాకు జనసేన పార్టీకి ఇంధనంగా పని చేసిందన్నారు. ఇంటర్ చదివే సమయంలో అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని.. మా ఇంట్లో హనుమంతుడి భక్తులు కాబట్టి రాముడి చరణాల కింద ఉంటాడని.. కాబట్టి రామ్ చరణ్ అని మా నాన్న పెట్టారన్నారు. చిరంజీవి నాకు అన్నయ్య మాత్రమే కాదని.. తండ్రి సమానుడని వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు తనను బాగా ఏడిపించేవాడినని గుర్తు చేసుకున్నారు. చరణ్ అద్భుతమైన డ్యాన్సర్ అని.. రంగస్థలం సినిమాలో నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని అనిపించిందని.. భవిష్యత్తులో ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటాడన్నారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అయ్యాడని సంతోషం వ్యక్తం చేశారు.