పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా మార్చి 28న విడుదల కావాలి. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో సినిమాను మే 9కి వాయిదా వేశారు. ఆ తేదీనైనా ఈ సినిమా వస్తుందా? అనే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే 9న వీరమల్లు ఆగమనం ఖాయమేనని తెలుస్తున్నది. పవన్‌కల్యాణ్ ఈ నెలాఖరు వరకూ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారు. ఈ వారంలోనే పవన్‌పై బ్యాలెన్స్ షూటింగ్ మొదలు కానుంది.
పనిలోపనిగా ప్రమోషన్స్ విషయంలో కూడా దూకుడు పెంచారు. షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ రెండూ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి, మే 9న సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర పాత్రధారులు. ఈ సినిమా కొంతభాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుత దర్శకుడు జ్యోతికృష్ణ. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.