Main Atal Hoon | స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా ‘మై అటల్ హూ’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో వాజపేయిగా పంకజ్ త్రిపాఠి పరకాయ ప్రవేశం చేసినట్లుగా కనిపిస్తున్నారు. అచ్చం ఆయన పోలికలతో ఉన్నట్లుగా ఫస్ట్ లుక్‌లో పంకజ్ కనిపిస్తున్నారు. వాజపేయి బయోపిక్‌గా ‘మై అటల్ హూ’ అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కవి, రాజనీతిజ్ఞుడు, నాయకుడు, మానవతావాది అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి అటల్ బిహారీ వాజపేయి ప్రయాణం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
వాజపేయి బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు పంకజ్ త్రిపాఠి ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మై అటల్ హూ మోషన్ పోస్టర్ విడుదలతో వాజపేయి అభిమానులు ఇన్నాళ్లుగా ఆయన బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణ ముగిసనట్లయింది. ఫస్ట్‌లుక్‌ను పంకజ్ త్రిపాటి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. నేను జారిపోలేదు.. తల దించుకోలేదు.. నేను కదలకుండా ఉన్నాను అనే అర్థం వచ్చేలా ఫస్ట్ లుక్ కింద పంకజ్ కాప్షన్ రాశారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రవిజాదవ్ దర్శకత్వంలో ఉత్కర్ష్ నైతానీ రాసిన ఈ సినిమా 2023 డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం సమీర్ సమకూర్చగా, సాహిత్యాన్ని సలీం-సులైమాన్ అందించారు. కాగా, సోనూ నిగమ్ స్వరాలు అందించారు. మై అటల్ హూ సినిమాను భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. వినోద్ భానుషాలి, సందీప్ సింగ్, సామ్ ఖాన్, కమలేష్ భానుశాలి కలిసి నిర్మించగా.. జీషన్ అహ్మద్, శివ్ శర్మ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.