e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home సినిమా పాన్‌ఇండియా ఇమేజ్‌ గర్వంగా అనిపిస్తున్నది!

పాన్‌ఇండియా ఇమేజ్‌ గర్వంగా అనిపిస్తున్నది!

పాన్‌ఇండియా ఇమేజ్‌ గర్వంగా అనిపిస్తున్నది!

సినీరంగంలో పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా ప్రయాణాన్ని సాగిస్తోంది సీనియర్‌ కథానాయిక ప్రియమణి. దక్షిణాది భాషల్లో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న ఆమె హిందీ చిత్రసీమలో కూడా సత్తా చాటుతోంది. ‘నా దృష్టిలో కథే సినిమాకు హీరో. కథతో పాటు నా పాత్రలోని భావోద్వేగాలు నచ్చితే సినిమాకు అంగీకరిస్తా. పాన్‌ఇండియా నటిగా ఇమేజ్‌ను సాధించడం చాలా గర్వంగా ఉంది’ అని చెప్పింది ప్రియమణి. ఆమె సుందరమ్మగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో సంభాషిస్తూ ప్రియమణి పంచుకున్న సంగతులివి..

ఈ సినిమాలో సుందరమ్మగా మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?
పూర్తి పల్లెటూరి నేపథ్యంలో నేను నటించిన తొలి తెలుగు చిత్రమిది. నా పాత్ర సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ వాస్తవిక కోణంలో సాగుతుంది. గ్రామీణ యువతి తాలూకు ఉద్వేగాల్ని ప్రతిఫలిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు నా పాత్రలో ఎంతటి భావోద్వేగాలున్నాయో అర్థమైంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్తరకమైన అనుభూతినందించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది.

- Advertisement -

ఇద్దరు పిల్లల తల్లి పాత్ర కాబట్టి ఈ సినిమాను ఒప్పుకోవడానికి తొలుత ఏమైనా సందేహించారా?
అలాంటిదేమీ లేదు. సుందరమ్మ పాత్ర విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోలేదు. ఎందుకంటే నేను గతంలో తమిళం, మలయాళ చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించాను. ఈ సినిమా మాతృక ‘అసురన్‌’ చూశాను కాబట్టి కథాగమనంలో నా పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అవగాహన ఉంది. ‘ఫ్యామిలీమెన్‌’ వెబ్‌సిరీస్‌లో కూడా నేను మదర్‌ క్యారెక్టర్‌లో కనిపించాను. చాలా మంది చెబుతున్నట్లు తల్లి పాత్రల ద్వారా చాలా ఫేమస్‌ అయిపోతానేమో అనిపిస్తుంది (నవ్వుతూ).

తమిళ ఒరిజినల్‌ వెర్షన్‌లో మీ పాత్రను మంజు వారియర్‌ వంటి సీనియర్‌ నటి పోషించారు. ఆమె పాత్ర ఛాయలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
మంజు వారియర్‌గారు గొప్ప నటి. ఆమెతో నేను ఏమాత్రం పోల్చుకోను. సుందరమ్మ పాత్రలో నాదైన సహజ అభినయాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాను. పాత్రలోని గాఢతను ఆకళింపు చేసుకొని పూర్తిగా న్యాయం చేయాలని తపించాను. మంజు వారియర్‌ వంటి అద్భుత ప్రతిభావంతురాలు చేసిన పాత్ర నాకు లభించడం ఓ గౌరవంగా భావిస్తున్నా.

రీమేక్‌ సినిమాల వల్ల మాతృక తాలూకు మ్యాజిక్‌ను తిరిగి పునరావృతం చేయడం సాధ్యమేనంటారా?
సినిమా షూటింగ్‌ సమయంలో, డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ఒరిజినల్‌ సినిమాలోని ఎమోషన్స్‌ అన్నీ రీమేక్‌లో ఆవిష్కృతమయ్యాయని అనిపించింది. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కథను అద్భుతంగా డీల్‌ చేశారు. అన్ని అంశాలు పక్కాగా కుదిరితే రీమేక్‌ను కూడా ఒరిజినల్‌ స్థాయిలో తెరకెక్కించవొచ్చని నేను నమ్ముతాను.

సినీరంగంలో పద్దెనిమిదేళ్లుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. దీనిని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది?
చాలా సంతోషంగా ఉంది. భాషాంతరాలు లేకుండా ప్రతి పరిశ్రమలో నాదైన ముద్ర వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. కెరీర్‌ ఏమాత్రం తీరిక లేకుండా బిజీగా మారిపోయింది. పాన్‌ఇండియా నటిగా గుర్తింపును తెచ్చుకోవడం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను.

పాన్‌ఇండియా నటిగా కథాంశాల ఎంపికలో మీరు ఏయే అంశాలకు ప్రాధాన్యతనిస్తారు?
మంచి కథే సినిమాకు హీరో అని నేను బలంగా విశ్వసిస్తాను. కెరీర్‌ ఆరంభం నుంచి అదే అభిప్రాయంతో ఉన్నా. కథ..నా పాత్ర చిత్రణలో వైవిధ్యం నచ్చితే సినిమాకు ఒప్పుకొంటాను. దర్శకుడి మీద పూర్తి నమ్మకంతో నా పాత్రలో రాణించే ప్రయత్నం చేస్తాను.

కెరీర్‌లో ఇంతటి సుదీర్ఘకాలం కొనసాగడం వెనక మీకు ప్రేరణనిస్తున్న అంశాలేమిటి?
దేవుడి దయతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కెరీర్‌ సంతోషంగా సాగిపోతోంది. వివిధ భాషల ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ కూడా ముందుకు నడిపిస్తోంది.

సినిమాల ఎంపిక విషయంలో మీ భర్త ముస్తఫా రాజ్‌ సలహాలు ఏమైనా తీసుకుంటారా? వివాహనంతరం కథల ఎంపికలో ప్రాధామ్యాలు ఏమైనా మారాయా?
నా భర్త సలహాలు తప్పకుండా తీసుకుంటా. యాడ్‌ ఫిల్మ్‌ మొదలుకొని సినిమాలు, వెబ్‌సిరీస్‌..ఏదైనా సరే ఆయనతో చర్చించి ఇద్దరం కలిసి ఓ నిర్ణయానికొస్తాం. కథల సెలెక్షన్‌లో ఆయన జడ్జ్‌మెంట్‌ బాగుంటుంది. అదృష్టం కొద్ది వివాహనంతరం కథల ఎంపికలో నాకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. నా మనసుకు నచ్చిన పాత్రలే వరిస్తున్నాయి. సినిమా ఎలాంటిదైనా కథ నచ్చితేనే నేను అంగీకరిస్తాను. ప్రస్తుతం తెలుగులో ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్‌ఇండియా స్థాయిలో మరో నాలుగు సినిమాల్లో నటించబోతున్నా. ఆ వివరాలన్నీ త్వరలో తెలియజేస్తా.

తమిళ ‘అసురన్‌’ దర్శకుడు వెట్రిమారన్‌తో ఈ సినిమా గురించి మాట్లాడాను. నేను సినిమాలో మంజు వారియర్‌ పోషించిన పాత్రలో నటిస్తున్నానని తెలిసి ఆయన చాలా సంతోషపడ్డారు. ‘తప్పకుండా మీరు ఆ క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేస్తారు’ అని ప్రశంసించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాన్‌ఇండియా ఇమేజ్‌ గర్వంగా అనిపిస్తున్నది!
పాన్‌ఇండియా ఇమేజ్‌ గర్వంగా అనిపిస్తున్నది!
పాన్‌ఇండియా ఇమేజ్‌ గర్వంగా అనిపిస్తున్నది!

ట్రెండింగ్‌

Advertisement